సోనియా చేతుల్లోకి చిరంజీవి 150 సినిమా!
హైదరాబాద్: నొప్పించక... తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అనే వ్యాఖ్యాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి. తన 150వ సినిమాపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశ పరచకుండా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెబుతూ వస్తున్నచిరంజీవి..... తాజాగా మరోసారి తెలివిగా ప్రవర్తించారు.
తాజాగా ఆయన్ను మీడియా వారు 150వ సినిమా గురించి అడగ్గా..... హైకమాండ్ అనుమతి ఇస్తే 150వ సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించారు. అంతకంటే ముందు మంచి కథ దొరకాలని తేల్చి చెప్పారు. ఇలా మాట్లాడటం ద్వారా తన 150 సినిమా విషయాన్ని సోనియా చేతుల్లో పెట్టారు చిరంజీవి. సోనియమ్మ ఆశీస్సులు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్సయ్యేలా సినిమా చేస్తానని చెప్పకనే చెప్పారని అంటున్నారు.
ఇటీవలే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి..... ఇక 150వ సినిమా చేయలేనేమో అని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత బాధ్యత మరింత పెరిగిందని, ఈ నేపథ్యంలో సినిమాల కోసం సమయం కేటాయించడం వీలు కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు, చిరు తాజా వ్యాఖ్యలు కాస్త సంతోషాన్ని ఇచ్చాయి.
2008లో రాజకీయ పార్టీ పెట్టే ముందు చిరంజీవి నటనకు స్వస్థి పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత మంచి కథ దొరికితే చేస్తానేమో అంటూ మాట మార్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజకీయాల్లో బిజీ అయ్యాను చేయలేనేమో అంటూ మరో సారి తన అయోమయ పరిస్థితి బయట పెట్టారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిరంజీవి మరోసారి 150వ సినిమా చేయనని ప్రకటించారు. తాజాగా హైకమాండ్ అనుమతి ఇస్తే చేస్తానంటూ తన నిలకడలేని వ్యక్తిత్వాన్ని బట్టబయలు చేసారు.
No comments:
Post a Comment