Sunday, November 11, 2012

ఇత్నాహిందీ నై ఆతా, అబ్ సే సీఖూంగా: చిరంజీవి


ఇత్నాహిందీ నై ఆతా, అబ్ సే సీఖూంగా: చిరంజీవి


 Chiranjeevi Faces Hindi Language Problem


న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవికి హిందీ పెద్ద సమస్యగా తయారైందని చెప్పాలి. చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా తొలి విదేశీ పర్యటనకు లండన్ వెళ్లారు. ఆ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చారు. లండన్‌లో జరిగిన ప్రపంచ పర్యాటకోత్సవం గురించి చెప్పడానికి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఢిల్లీ మీడియా అంటే అన్ని భాషలకు చెందిన మీడియా ప్రతినిధులూ ఉంటారు కదా. దక్షిణాదికి చెందిన మీడియా ప్రతినిధులకు హిందీ అయినా, ఇంగ్లీషు అయినా ఫరవాలేదుగాని ఉత్తరాది మీడియా ప్రతినిధులకు మాత్రం హిందీలోనే విషయాలు చెప్పాల్సి ఉంటుంది. కనీసం మొత్తం సారాంశాన్ని సంక్షిప్తంగానైనా హిందీలో వివరించాలి. చిరు తన పర్యటనలో ఏవేం జరిగిందీ చెప్పిన అనంతరం ఉత్తరాదికి చెందిన మీడియా ప్రతినిధులు అదంతా హిందీలో చెప్పాలని అడిగారు.
చిరంజీవి నవ్వేసి ఆంత హిందీ ఇంకా తనకు రాలేదని, కొన్నాళ్లు వ్యవధి ఇస్తే నేర్చుకుంటానని చెప్పారు. ఇత్‌నా హిందీ అభీ నై ఆతా, అబ్ మే సీఖోంగా, నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ హిందీ మే కరూంగా అంటూ పెద్దగా నవ్వేస్తూ చెప్పడంతో అందరూ సరదాగా నవ్వుకున్నారు. తప్పకుండా నేర్చుకుంటానని, ఈసారి హిందీలోనే మాట్లాడతాననీ చెప్పడం ఉత్తరాది మీడియా ప్రతినిధులకు సంతోషం కలిగించింది.
తన లండన్ పర్యటన విజయవంతమైందని ఆయన చెప్పారు. భారత్‌కు విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన అన్నారు. లండన్ ఉత్సవం సందర్భంగా తాను వివిధ దేశాల పర్యాటక మంత్రులతో మాట్లాడినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలపై బ్రిటన్ నిషేధం ఎత్తేసిందని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు ఇక నుంచి బ్రిటన్ టూరిస్టులు వస్తారని అన్నారు.
ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. పర్యాటక రంగం ద్వారా 2.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. మూడు విభాగాల్లో తమకు ప్రపంచ పర్యాటక అవార్డులు లభించినట్లు తెలిపారు. హైదరాబాదులో వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీన అంతర్జాతీయ పర్యాటక సదస్సు జరిగే అవకాశాలున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment