Monday, October 22, 2012

చిరంజీవికి మంత్రి పదవి

చిరంజీవికి మంత్రి పదవి: ఢిల్లీలో ఉండాలని సూచన


 Congress High Command Suggests Chiranjeevi
న్యూఢిల్లీ: ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కాంగ్రెసు అధిష్టానం రాజ్యసభ చిరంజీవికి సూచించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టేనని భావిస్తున్నారు. ఈనెల 24 నుంచి 28 తేదీల మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈమేరకు పార్టీ అధిష్ఠానం నుంచి చిరంజీవికి పిలుపు వచ్చినట్టు సమాచారం.
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి స్థానం ఇవ్వాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేసిన తర్వాత, ఆ పార్టీకి సముచిత స్థానం, చిరంజీవికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదా ఎస్ జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, జైరాం రమేష్‌కు ఉంది.
సహాయ మంత్రులుగా దగ్గుబాటి పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, ఎం పల్లంరాజు ఉన్నారు. జైపాల్ రెడ్డి మినహా మిగిలినవారు అంతా కోస్తాంధ్రకు చెందిన వారే. ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే చిరంజీవికి కూడా కోస్తాంధ్రకు చెందిన నాయకుడే. దీంతో తెలంగాణ ప్రాంతం నుంచి కచ్చితంగా ఇద్దరు పార్లెమంటు సభ్యులకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశిస్తున్నారు.
దక్షిణ భారత దేశంలో బలంగా ఉన్న యాదవ కులానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేక బీసీ అయిన వి హనుమంతరావును తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. అయితే ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. తనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని సర్వే సత్యనారాయణ గట్టిగా నమ్ముతున్నారు.
కాగా, కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు కూడా చాలా కాలం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కావూరి సాంబశివ రావుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే, ఆ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులకు స్థానం కల్పించడం సందేహమేనని అంటున్నారు.

No comments:

Post a Comment