Tuesday, October 30, 2012

చిరంజీవి: సినిమాల్లో ఖైదీ, రాజకీయాల్లో మంత్రి


చిరంజీవి: సినిమాల్లో ఖైదీ, రాజకీయాల్లో మంత్రి


Chiranjeevi Khaidi Films Minister In Politics

హైదరాబాద్: సినీ రంగంలో ఖైదీ సినిమా కలిసి వచ్చినట్లుగానే మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లో కేంద్ర మంత్రి పదవి కలిసి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. యాదృచ్ఛికమే అయినా ఖైదీ వచ్చిన తేదీ, చిరంజీవి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ ఒక్కటే. దాదాపు పదేళ్ల క్రితం ఖైదీ సినిమా చిరంజీవిని తెలుగు సినీ ప్రపంచంలో తిరుగులేని హీరోగా నిలబెట్టింది. మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చి పెట్టింది. ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28వ తేదీన వచ్చింది.
కేంద్ర మంత్రిగా చిరంజీవి 2012 అక్టోబర్ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల రాజకీయాల్లో కూడా చిరంజీవి ఒక్క వెలుగు వెలిగి నెంబర్ వన్ అవుతారా అనే చర్చ సాగుతోంది. పునాదిరాళ్లు సినిమాతో సాదాసీదాగా సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి ఆ తర్వాత కొన్ని విలన్ పాత్రలు కూడా పోషించారు. ఖైదీయే ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. ఫస్ట్ బ్లడ్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారని అంటారు. యాంగ్రీ యంగ్‌మన్‌గా చిరంజీవి ఈ సినిమాలో ఓ ఊపు ఊపారు.
ఖైదీలో చిరంజీవి చేసిన డ్యాన్స్‌లు, చేసిన ఫైట్స్ యువతరాన్ని ఒక ఊపు ఊపాయి. చిరంజీవి యువకులు గుండెల్లో స్థిరమైన స్థానం ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలో ఆయన నెంబర్ వన్ హీరో అయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చిరంజీవి రాజకీయాల్లో తన ప్రతాపాన్ని ప్రదర్సిస్తారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి ఆయన ప్రధాన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిస్తే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అనుయాయులు భావిస్తున్నారు. కాంగ్రెసులో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కూడా తన వర్గాన్ని ఆయన అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ వర్గం అండదండలతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఏమో, చిరంజీవికి రాజకీయాల్లో కేంద్ర మంత్రి పదవి కలిసి వస్తుందేమో చూద్దాం.

No comments:

Post a Comment